సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యం
- విముక్త, సంచార, అర్థ సంచార జాతుల, కులాల జాతీయ సదస్సులో డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు
• బాలకృష్ణ రెనకె కమిషన్ సిఫారసులను వెంటనే అనులు చేయాలి.
• ఈ వర్గాలు విద్య, ఉద్యోగ రంగాలలో దేశంలో ఒక్క శాతం కూడా ప్రాతినిధ్యం లేకపోవడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం.
• జాతీయ స్థాయిలో ఈ వర్గాల అభివృద్ధి నిమిత్తం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి.
• శాస్త్రీయంగా వీరి గణనం చేపట్టి అందుకు అనుగుణంగా నిధులను కేటాయించాలి.
• నేటి జాతీయ సదస్సులో “హైదరాబాద్ డిక్లరేషన్” ముసాయిదాను ఆవిష్కరించిన డాక్టర్ వకుళాభరణం.
విముక్త సంచార, అర్థ సంచార జాతుల, కులాలు ప్రాతినిధ్యం ఆధునిక అభివృద్దిలో ఒక్క శాతం కూడా లేకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు. ఈ జాతులు సమున్నతంగా ఎదగాలని లక్షించి సమగ్రంగా అందజేసిన బాలకృష్ణ రేనకె కమిషన్ నివేదికను బుట్ట దాఖలు చేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సాంస్కృతిక పునర్వైభవంలో, కళలను రక్షించడంలో, వివిధ సేవా వృత్తులతో జీవితాలను సమాజ ప్రగతికి అంకితం చేసిన ఈ జాతులను అభివృద్ధిలో భాగం చేయక పోవడం విచారించదగిందని ఆయన అభిప్రాయ పడ్డారు.
తెలంగాణ రాష్ట్ర DNT, NT సంఘం ఆధ్వర్యంలో నగరంలో 3 రోజుల పాటు నిర్వహించనున్న డీనోటిఫైడ్ ట్రైబ్స్ (విముక్త జాతులు), నోమాడిక్ ట్రైబ్స్( సంచార జాతులు), సెమి నోమాడిక్ ట్రైబ్స్ (అర్థ సంచార జాతులు) కులాల జాతీయ సదస్సు “హైదరాబాద్ డిక్లరేషన్ – 2023” పేరిట బుధవారం నాడు లాంఛనంగా ఆరంభమయ్యాయి. బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు పాల్గొని కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా “హైదరాబాద్ డిక్లరేషన్” ముసాయిదాను ఆయన ఆవిష్కరించారు. సదస్సుకు జాతీయ డి.ఎన్.టి. కమిషన్ మాజీ ఛైర్మన్ బాలకృష్ణ రేనకె సభాధ్యక్షులు గా వ్యవహరించారు. సదస్సు నిర్వాహకులుగా రాష్ట్ర సంఘం అధ్యక్షుడు ఒంటెద్దు నరేందర్, ప్రదాన కార్యదర్శి తిపిరిశెట్టి శ్రీనివాస్, జాతీయ సమన్వయకర్తగా పల్లవి రెనకె, రాష్ట్ర సమన్వయకర్తగా పల్లపు సమ్మయ్య, అధికార ప్రతినిధి వెన్నెల నాగరాజు లు వ్యవహరించారు. కార్యక్రమంలో అతిధులుగా వివిధ 14 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులుగా ప్రొఫెసర్ ఐ.తిరుమలి, ప్రొఫెసర్ చెన్న బసవయ్య, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎం.బి.సి. కార్పొరేషన్ ఛైర్మన్ పెండ్ర వీరన్న, వివిధ 14 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
బుధవారం నాడు 4 సెషన్లుగా ఈ సదస్సు కొనసాగింది. ఈ సందర్భంగా జాతీయ సదస్సులో ప్రసంగిస్తూ డాక్టర్ వకుళాభరణం ప్రసంగిస్తూ… కేంద్ర ప్రభుత్వం బలహీన వర్గాలు, సంచార జాతులు, కులాలపై సవతి తల్లిప్రేమను ప్రదర్శిస్తుందని ఆయన విమర్శించారు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య మంత్రి కేసీఆర్ దార్శనికతను ప్రదర్శించి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ తెలంగాణను సంక్షేమ రంగంలో రోల్ మోడల్ గా నిలిపారని ఆయన కితాబు ఇచ్చారు. రాష్ట్రంలో అనులవుతున్న అన్ని సంక్షేమ పథకాలకు వెచ్చిస్తున్న నిధులను గణించి చూసినప్పుడు, వార్షిక బడ్జెట్లో 40% నిధులు కేటాయిస్తున్నట్లు స్పష్టమవుతుందని ఆయన తెలిపారు. ఇలా నిధులు, కేటాయింపులు చేయడంలో దేశంలోనే రికార్డు సాధించిన రాష్ట్రంగా తెలంగాణ అగ్ర స్థానంలో నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఉదాహరణకు వందలాది మహాత్మ జ్యోతిభా ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలలు, ఒక్కొక్కరికి 20 లక్షల ఉచిత గ్రాంట్ తో యేటా 300 మందికి విదేశీ విద్యా సదుపాయం, బోధనా రుసుముల పథకం మున్నగు పథకాలు దేశంలోని ఏ రాష్ట్రమైనా ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఈ సామాజిక జాతులు, కులాల ప్రగతికి ఒక్క పథకమైనా పెట్టగలిగిందా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. జనాభా గణనలో కుల గణన చేపట్టరు, సంక్షేమ రంగానికి నిధులు కేటాయించరు, ప్రణాళికా బద్దమైన పథకాలు రూపకల్పన చేయరు. ఈ తీరును ప్రజాస్వామ్య బద్ధమైనదని ఎలా భావించగలం అని డాక్టర్ వకుళాభరణం అన్నారు.
ప్రొఫెసర్ ఐ.తిరుమలి ప్రసంగిస్తూ… బాలకృష్ణ రేనకే కమిషన్ సిఫారసులను వెంటనే అమలు లో లేవాలని డిమాండ్ చేశారు.
ప్రొఫెసర్ చెన్న బసవయ్య మాట్లాడుతూ… సంచార కులాలు, జాతులను ఇప్పటికైనా నిర్మాణాత్మక విధానంతో చర్యలు చేపట్టాలని కోరారు.
ఢిల్లీ కి చెందిన ప్రతినిధి శ్రీమతి. రేణు ఆచారి, ఆంధ్ర ప్రదేశ్ ఎం.బి.సి. కార్పొరేషన్ ఛైర్మన్ పెండ్ర వీరన్న, దాసరి రవి (ఆo.ప్ర.), దిలీప్ సిసోడియా (గుజరాత్), ఆనందరావు అంగల్వర్ (మహారాష్ట్ర), మర్రి ముత్తు (తమిళనాడు), బాలక్ రామ్ సంచారి (పంజాబ్), పియూష్ రంజన్ సాహు (ఛత్తీస్గఢ్), కల్పనా జోషి (కర్ణాటక), సదానంద బాగ్ (ఓడిస్సా), లీలాధార్ నినానియా (రాజస్థాన్), సుకేంద్ర ప్రతాప్ (ఉత్తర్ ప్రదేశ్), రనవీర్ సింగ్, రణధీర్ సింగ్ (హర్యానా) పాల్గొన్నారు.