డెబ్బై రెండు సంవత్సరాల క్రితం భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా , మన దేశంలో కొనసాగుతున్న కుల వివక్ష ఈ రోజుకి తన ప్రభావాన్ని చూపుతున్నదన్న విషయానికి తార్కాణం ప్రణయ్ హత్య, ఒక కుల హత్య.
భారతీయులందరూ కలసికట్టుగా స్వాతంత్య్రం కోసం పోరాడి నటువంటి రోజులు మనవి. భారతీయులందరూ ఒక్కటిగా కలిసి పోరాడిన రోజులు అవి. ప్రతి మనిషిలో ఒకే రక్తం ప్రవహిస్తుందని నమ్మిన మన భారతదేశంలో ఇటువంటి కుల విద్వేషాలు చెలరేగుతట ఎంతటి దుర్బలత్వము. అంబేద్కర్ గారు కలలు కన్నా దేశమా ఇది. ఇప్పటికీ కుల మత పిచ్చితో రగిలిపోతున్న వారిలో మార్పు ఎప్పటికి వస్తుంది. అందుకే మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల పరిగనలోకె వస్తుంది. మనిషి యొక్క ఆలోచనా విధానం ఎప్పుడు మారుతుంది.చివరకు భారతదేశంలో ఈ కులాల వ్యవస్థే అధికారం చెలాయిస్తుంది అన్న విషయానికి నిదర్శనంగా ఇప్పుడు జరిగినటువంటి సంఘటన చెప్పకనే చెబుతుంది. ఇక వివరాల్లోకి వెళితే……………….
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు ప్రణయ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కోపంతోనే అల్లుడు ప్రణయ్‌ని సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
యువతి అమృత వర్షిణి వైశ్య కులానికి చెందినది. యువకుడు పెరుమాళ్ల ప్రణయ్ ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి. వీళ్లిద్దరూ బీటెక్ నుంచి ప్రేమించుకుంటున్నారు. ప్రేమ విషయం వర్షిణి ఇంట్లో తెలియడంతో ఆమె తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అమ్మాయిని వేధింపులకు గురిచేశాడు.
అయితే, వర్షిణి మాత్రం ప్రణయ్‌ని వదలి పెట్టలేదు. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని హైదరాబాద్ పారిపోయారు. ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకుని మిర్యాలగూడలోనే కాపురం పెట్టారు. అప్పట్నుంచి వర్షిణి తండ్రి మారుతీరావు నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. వేధింపులు మరింత పెరగడంతో వర్షిణి, ప్రణయ్ ఐజీని ఆశ్రయించారు. తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. ఐజీ ఆదేశాలతో ఎస్పీ యువతి, యువకుడి తరపు తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఆ తర్వాత నుంచి మారుతీరావు ప్రవర్తనలో మార్పు వచ్చింది. కూతురితో సఖ్యంగానే ఉంటున్నట్లు నటించాడు. రెగ్యులర్‌గా ఫోన్లు మాట్లాడటం, తరచూ వారిని చూసేందుకు వస్తుండటంతో అంతా సర్దుకుపోయిందని భావించారు. పోలీసులు కూడా కలిసున్నారనే అనుకున్నారు. కానీ, మారుతీరావు ఓ వైపు మంచిగానే నటిస్తూ, మరోవైపు నుంచి తన ప్లాన్ అమలు చేశాడు.. ఇందులో భాగంగానే ఓ గ్యాగ్‌కు సుపారీ ఇచ్చి అల్లుణ్ని అడ్డుతొలగించుకోవాలనుకున్నాడు.
ఈ కేసులో మారుతీరావు తమ్మడు కూడా నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరూ కలిసి పది లక్షల సుపారీ ఇచ్చి మరీ కన్నకూతురు భర్తను హత్య చేయించారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అమ్మాయి వర్షిణి మూడు నెలల గర్భవతి అని చెబుతున్నారు. అయినా పథకం ప్రకారం ఆమె ముందే తన భర్తను దారుణంగా నరికి చంపడం మిర్యాలగూడలో కలవరం రేపింది. మంచిగా ఉన్నట్లు నటిస్తూనే ఇంతటి దారుణానికి పాల్పడడం జనాలను కలిచివేస్తున్నది. హత్య జరిగే కంటే 45 నిమిషాల ముందు నుంచి వారు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రేమను త్యాగం చేస్తే ప్రణయ్ కి 3 కోట్ల ఆఫర్ ?
ప్రణయ్, వర్షిణి ప్రేమించుకున్న విషయం తెలియగానే అమ్మాయి తండ్రి మారుతీరావు అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. ప్రేమను భగ్నం చేసేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాడు. మిర్యాలగూడ పట్టణంలో మారుతీరావు కుటుంబం సంపన్నమైన కుటుంబంగా చెబుతున్నారు. ప్రణయ్ ఫ్యామిలీ కూడా ఎగువ మధ్య తరగతి కుటుంబమే. మారుతీరావుకు ఒక్కతే కూతురు కావడంతో ప్రేమ పెళ్లిని అంగీకరించలేకపోయాడు మారుతీరావు. అయితే తన కూతురును మరిచిపోవాలని ప్రణయ్ కి మూడు కోట్ల రూపాయలు ఇస్తానని ఆఫర్ పెట్టినట్లు తెలిసింది. కానీ ప్రణయ్ అంగీకరించలేదు. మారుతీ ఇచ్చిన ఆఫర్ రిజెక్ట్ చేసిన ప్రణయ్, అమృతను పెళ్లి చేసుకోవడానికే మొగ్గు చూపారు. తుదకు ఇలా ఈ ప్రేమ కథకు ముగింపు పలికాడు మారుతీరావు..
మన సమాజంలో ఉన్న కుల వ్యవస్థ అనే మహమ్మారి అలాగే ఉండిపోయింది. మనం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ ఉన్నా ఈ కుల వ్యవస్థ మన దేశాన్ని అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల జాబితాలోనే ఉండేలా చేసింది. అంబేద్కర్ గారు కలలు కన్న దేశం కుల వ్యవస్థ లేని దేశం. ఆర్థిక అసమానతలు మరియు విద్యా అసమానతలు తొలగిపోతే కులవ్యవస్థ అంతమవుతుందనుకున్నారు కానీ, ఈ రోజు కూడా మన రాజకీయ నాయకులు కులం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతూనే ఉన్నారు. కులం అన్నది ఒక ఊహాత్మకమైన, వ్యర్థమైన ఆలోచన తప్పితే ఈ వ్యవస్థ ఎప్పుడూ మన అభివృద్ధికి చేయూతనిచ్చిన సాక్ష్యాలు లేవు. మనిషి యొక్క ఒక సగటు భారతీయుని యొక్క ఆలోచనా విధానం ఎప్పుడు మారుతుంది.
ఈ కుల వ్యవస్థ అన్న మహమ్మారిని మనం ముగింపు పలకకపోతే , ఇది మన భారతదేశాన్ని ముక్కలు చెక్కలుగా చేయక మానదు. అంటే ఎవరి చేతి లోనైతే అధికారం ఉన్నదో వారు తిరిగి ఈ కుల వ్యవస్థ వైపు మొగ్గు చూపుతున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. అంటే మనం తిరిగి మన బానిస బతుకుల్లోకి మెల్లగా జారి పోతున్నామనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. దీనిని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ప్రతి భారతీయుడికి ఉందని తెలియజేస్తున్నాం.