డిజిటల్ తెలంగాణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత.. టీఎస్‌ఐసీ, టీ హబ్, టాస్క్ తదితర సంస్థలతో ఐటీ కార్యకలాపాలు పెరిగేలా ప్రోత్సహిస్తోంది.
జాతీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు కొండంత అండగా నిలుస్తోంది భాగ్యనగరం. ప్రభుత్వ విధానాలు వారికి శ్రీరామరక్షగా నిలుస్తున్నాయి. తిరుగు లేని మానవ నైపుణ్యం వారికి భరోసానిస్తోంది. అంతేకాదు అనుమతుల జారీలో అవినీతికి తావులేని విధానాలు.. ప్రభుత్వ పారదర్శకత.. ఫ్రెండ్లీ పోలీసింగ్.. భిన్నత్వంలో ఏకత్వం.. చారిత్రక వారసత్వ సంపద.. విస్తారమైన వాయు, రోడ్డు కనెక్టివిటీ.. ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకోగల ప్రాంతం.. అంతకుమించి డైనమిక్ లీడర్ కేటీఆర్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండటం.. వెరసి హైదరాబాద్ నేడు ప్రపంచానికి దిక్సూచిగా మారుతోంది. పెట్టుబడులకు కేంద్రంగా వెలసిల్లుతోంది. ఇప్పటికే వేల కోట్ల పెట్టుబడులతో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరంలో వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయి. తాజాగా ప్రపంచంలో పేరొందిన ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. రూ.20,761 కోట్లతో నగరంలో వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయబోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రాన్ని హైదరాబాద్‌లో అమెజాన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఫ్లిప్‌కార్ట్ కూడా తన డేటా సెంటర్‌ను నగరంలో ఏర్పాటు చేసింది. మరోసారి భారీ పెట్టుబడితో అమెజాన్ హైదరాబాద్‌తో తన బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఇటీవల అనేక అధ్యయన సంస్థలు సైతం ప్రభుత్వ విధానాలతో పెట్టుబడులు తరలివస్తున్నాయని ప్రశంసించాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్ర, డెలాయిట్, కాగ్నిజెంట్ తదితర మల్టీనేషనల్ కంపెనీలు తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. అంతేకాదు మొదటిసారిగా డేటా సెంటర్ల పాలసీని తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే కావడం విశేషం.