బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్ చట్టం అవసరం
– జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి డిమాండ్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు పార్లమెంట్‌లో చట్టం తీసుకురావాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
“దశాబ్దాలుగా బీసీలు రిజర్వేషన్ల కోసం పోరాడుతుంటే… కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇది అత్యంత బాధాకరం. ఇప్పటికైనా కేంద్రం తన వైఖరిని మార్చుకుని రాష్ట్ర ప్రభుత్వం పంపిన బీసీ రిజర్వేషన్ బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలి” అని కోరారు.
ఈ విషయంలో తెలంగాణ భాజపా ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెస్తే మంచిది. లేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…
“బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను తొలగించాలనే అక్రమ డిమాండ్లను బీజేపీ తెరపైకి తీసుకువస్తోంది. ఇది బీసీ హక్కులను కాలరాయడానికి బూచిగా చూపిస్తుంది” అని విమర్శించారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు బీసీల హక్కులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం నిరాశ కలిగిస్తోందన్నారు.
“బీసీ బిల్లు ఆమోదిస్తే కాంగ్రెస్‌కు లాభం జరుగుతుందన్న రాజకీయ లెక్కలకే బీజేపీ అడుగులు వేస్తోంది. కానీ బీసీలు లెక్కలు కాదు… ఎవరు న్యాయం చేస్తే వారి వెంటే బీసీలు నిలుస్తారు.
మాపై కుట్రలు చేస్తే… మిమ్మల్ని ప్రజలు తగిన బుద్ధి చెబుతారు” అని హెచ్చరించారు.