ప్రగతి భవన్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఇవాళ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో పలు అంశాలపైన మంత్రిమండలి చర్చించి నిర్ణయాలు తీసుకున్నది.
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతి పై చర్చతో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పంచాయితీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖలు కేబినెట్ కు నివేదికలు సమర్పించాయి. వచ్చే నెల రోజుల లోపు, రాష్ట్రంలో నూటికి నూరుశాతం వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తి చేయాలని మంత్రులను, అధికారులను సీఎం ఆదేశించారు. ఇకమీద అన్ని గ్రామ పంచాయితీల్లో, వీధి దీపాల కొరకు మూడో వైర్’ ను తప్పకుండా ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖకు సీఎం స్పష్టం చేశారు.