హైదరాబాద్ శివార్లలోని బీబీనగర్‌లో ఎయిమ్స్ ఏర్పాటుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసింది. ఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకొంది. రూ.1,028 కోట్లతో దీన్ని ఏర్పాటుచేస్తారు. ఎయిమ్స్‌కు డైరెక్టర్ పోస్టునూ కేంద్రం మంజూరు చేసింది. తమిళనాడులోని మదురైలో రూ.1,264 కోట్లతో మరో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రమంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ రెండింటినీ ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద నిర్మిస్తారు. దీనివల్ల బీబీనగర్ ఎయిమ్స్‌కు 100 ఎంబీబీఎస్ సీట్లు, 60 బీఎస్సీ నర్సింగ్ సీట్లు లభిస్తాయి. 15-20 దాకా సూపర్ స్పెషాలిటీ డిపార్ట్‌మెంట్స్ ఇందులో ఏర్పాటవుతాయి.
రోజూ 1,500 మంది ఔట్‌పేషంట్లు
సుమారు 750 పడకలు రోగులకు అందుబాటులోకి వస్తాయి. వీటిలో రోజూ 1,500 మంది ఔట్‌పేషంట్లు, ప్రతి నెలా 1,000 మంది ఇన్‌పేషెంట్లకు వైద్యసేవలు లభిస్తాయి. అత్యవసర విభాగం/ ట్రామా, ఆయుష్, ప్రైవేటు, ఐసీయూ, సూపర్ స్పెషాలిటీ పడకలు ఇందులో ఉంటాయి. దీనికితోడు మెడికల్ కాలేజీ, ఆయూష్ బ్లాక్, ఆడిటోరియం, నైట్‌షెల్టర్, అతిథిగృహం, హాస్టళ్లు, గృహసముదాయాలుకూడా ఏర్పాటవుతాయి. 45 నెలల్లో వీటి నిర్మాణం పూర్తవుతుంది. తొలి పది నెలల్లో నిర్మాణానికి ముందస్తు సన్నాహాలు (ప్రి కన్‌స్ట్రక్షన్) జరుగుతాయి. తరువాత 32 నెలల్లో నిర్మాణం పూర్తి స్థాయిలో జరుగుతుంది. అనంతరం 3 నెలలపాటూ నిర్మాణ ముగింపు దశ (స్టెబిలైజేషన్) జరుగుతాయి. ఈ నిర్ణయంపట్ల భాజపా సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా తెలంగాణ ప్రజలకు మరింత నాణ్యమైన వైద్యసౌకర్యాలు, వైద్య విద్య అందుబాటులోకి వస్తుందన్నారు. ఇందుకు సహకరించిన ప్రధానమంత్రి మోదీ, వైద్యఆరోగ్యశాఖ శాఖ మంత్రి జేపీనడ్డాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎయిమ్స్‌కు నిధులు కేటాయించడంపై ఎంపీ వినోద్ హర్షం వ్యక్తం చేశారు. మరో ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది తెలంగాణ ఎంపీల విజయమని ఇరువురూ పేర్కొన్నారు.