మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలల్లో
కలుషిత ఆహారం ఘటన పై-మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి( Dundra Kumara Swamy)
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు అందజేస్తున్న ఆహారం కలుషితమవడంతో చిన్నారులు పదేపదే అస్వస్థతకు గురవుతున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, (National BC Dal)న్యాయవాది(Advocate )దుండ్ర కుమారస్వామి పేర్కొన్నారు. ఈ ఘటనలను మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.(State Human rights commission)
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం విద్యార్థులకు జీవన హక్కు, ఆరోగ్య హక్కు, గౌరవంతో జీవించే హక్కు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన గుర్తుచేశారు. అయితే పాఠశాలల్లోనే కలుషిత ఆహారం వల్ల పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
డిసెంబర్ 12న జరిగిన ఘటనలు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలని పేర్కొన్నారు. మాదాపూర్ ప్రభుత్వ పాఠశాల (చంద్రానాయక్ తండా)లో టిఫిన్, మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం 44 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురై ఆస్పత్రికి తరలించాల్సి వచ్చిందన్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫర్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. అలాగే బాగ్లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో కూడా కలుషిత ఆహారం కారణంగా విద్యార్థులు అనారోగ్యానికి గురై వైద్య సహాయం పొందాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఇలాంటి ఘటనలు గతంలోనూ రాష్ట్రవ్యాప్తంగా పునరావృతమవుతున్నా, సంబంధిత శాఖలు మరియు అధికారులు సరైన పర్యవేక్షణ, బాధ్యతతో చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ సంరక్షణలో ఉన్న పాఠశాలల్లోనే పిల్లలకు భద్రత లేకపోతే, అది ప్రజాస్వామ్యానికి తీవ్రమైన హెచ్చరికగా భావించాలన్నారు. ఈ నేపథ్యంలో ఘటనలపై స్వతంత్రంగా, సమగ్ర విచారణ చేపట్టాలని, నిర్లక్ష్యానికి బాధ్యులైన అధికారులు, కాంట్రాక్టర్లు, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను కోరినట్లు తెలిపారు. అలాగే అన్ని ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లో ఆహార నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, బాధిత విద్యార్థులకు తగిన వైద్య సహాయం, పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా దీర్ఘకాలిక మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల జీవన హక్కు, ఆరోగ్య హక్కు పరిరక్షణలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి విజ్ఞప్తి చేశారు.