సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు
బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు సాయి ఈశ్వరాచారి గారేనని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి అన్నారు.
జగద్గిరిగుట్టలోని సాయి ఈశ్వరాచారి గారి నివాసంలో ఆయనకు ఘన నివాళులు అర్పించిన వారిలో — శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకులభరణం కృష్ణమోహన్‌రావు, బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ప్రతినిధులు, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, గుజ్జ సత్యం, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
సాయి ఈశ్వరాచారి కుటుంబ సభ్యులను పరామర్శించిన దుండ్ర కుమారస్వామి — వారి పట్ల ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — తెలంగాణ
మలి దశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి అయితే… బీసీ రిజర్వేషన్ ఉద్యమంలో తొలి అమరుడు సాయి ఈశ్వరాచారే అని చరిత్ర స్పష్టంగా చెబుతోందన్నారు. ప్రజాస్వామ్య దేశంలో హక్కులు సాధించడానికి ప్రాణాలు త్యాగం చేయాల్సిన పరిస్థితి రావడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
సాయి ఈశ్వరాచారి మనలో లేకపోయినా… బీసీ ఉద్యమానికి ఆయన త్యాగం పోరాటానికి రెట్టింపు శక్తినిస్తుందని ఆయన పేర్కొన్నారు. దేశ జనాభాలో 52% ఉన్న బీసీలకు కనీసం 42% రిజర్వేషన్లు కూడా ఇవ్వకుండా కుట్రలు కొనసాగించడం తీవ్ర ఆవేదన కలిగిస్తోందని విమర్శించారు. ఈ అన్యాయానికి బీసీ ఓటు సమాధానం చెబుతుందన్నారు.
సాయి ఈశ్వరాచారి కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం వెంటనే ప్రకటించాలని, అలాగే కుటుంబ సభ్యుల్లో ఒకరికైనా తక్షణం ప్రభుత్వ ఉద్యోగం అందించాల్సిందిగా డిమాండ్ చేశారు.అదే విధంగా బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదించాలని కోరారు. బీసీ రిజర్వేషన్లపై ఆలస్యం చేసే పాలకులు… చరిత్ర పుటల్లో నిందితులుగా నిలిచిపోతారని హెచ్చరించారు.

