బీసీల రాష్ట్ర బంద్ — సామాజిక ఉద్యమానికి నాంది
రాష్ట్రం మొత్తం విజయవంతమైన బంద్
బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ (జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు) దుండ్ర కుమారస్వామి(Dundra Kumara Swamy)
బీసీ రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం బీసీ జేఏసీ చేపట్టిన బంద్ తెలంగాణ రాష్ట్రమంతా విజయవంతంగా కొనసాగుతోంది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ గేటు ముందు నుంచి హైదరాబాద్ జంక్షన్ వరకు 40 కుల సంఘాలతో కలిసి బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ పాదయాత్రతో రాష్ట్ర బంద్‌కు చారిత్రక నాంది పలికింది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్‌లో పాల్గొంటున్నాయి. ఖైరతాబాద్ జంక్షన్ నుంచి హైటెక్ సిటీ దాకా బీసీ జేఏసీ నేతలు కార్లతో నిరసన తెలియజేశారు. వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు, ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రజా రవాణా స్తంభించింది.
సామాజిక న్యాయాన్ని రక్షించడానికి, అసమానతలను రూపుమాపడానికి, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం తెలిపిన ప్రకారం సమాన అవకాశాలు, సమాన వాటా సాధించడానికి ఈ ఉద్యమం ప్రారంభమైందని జేఏసీ నేతలు స్పష్టం చేశారు.
బీసీల హక్కులు, రిజర్వేషన్లు, అభ్యున్నతి, ఐక్యత, ఆత్మగౌరవం, సామాజిక–ఆర్థిక–రాజకీయ సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించారు. ఈ ఉద్యమం చివరికి రాజ్యాధికార సాధన దిశగా దారితీస్తుందని పేర్కొన్నారు. సిద్ధాంత భావజాలం, అవగాహన సదస్సులు, యువత కీలక పాత్ర, మహిళలకు ప్రత్యేక స్థానం ఈ ఉద్యమానికి బలమని జేఏసీ తెలిపింది.
ప్రతి గ్రామం, ప్రతి మండలం, ప్రతి పట్టణం ఒకే నినాదంతో మారుమోగుతోంది —
“బీసీలకు న్యాయం జరగాలి! జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి!” బీసీ సిద్ధాంత భావజాలం వ్యాప్తి, బీసీ చైతన్య స్పూర్తి, కార్యాచరణ ప్రణాళికతో ఈ ఉద్యమం సమాజంలో కొత్త చరిత్ర సృష్టిస్తుందని జేఏసీ పేర్కొంది.
అంబేద్కర్ ఇచ్చిన ఓటు అనే వజ్రాయుధంతో మన నుదుటి రాతను మనమే మార్చుకోవాలని, “బీసీ ఓటు బీసీలకే” అనే నినాదాన్ని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయికి వ్యాప్తి చేయాలని పిలుపునిచ్చింది. బీసీ సిద్ధాంత భావజాలం వ్యాప్తితోనే భవిష్య తరాలకు బంగారు బాటలు వేయవచ్చని నేతలు పేర్కొన్నారు.. సామాజిక న్యాయం సాధన కోసం ఇది కేవలం ఉద్యమం కాదు — చరిత్రాత్మక పునరుద్ధరణ!” అని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు.