బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9పై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. ఈ క్రమంలో ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయటానికి నాలుగు వారాల గడువు, అలాగే పిటిషనర్లకు తమ కౌంటర్ సమర్పించటానికి రెండు వారాల గడువు హైకోర్టు మంజూరు చేసింది.ఈ పరిణామం పై జాతీయ బీసీ దళ్ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి (Dundra Kumara Swamy National President BC Dal) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఇది యావత్ బీసీ సమాజానికి తగిలిన పెద్ద దెబ్బ. కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక కుల గణన ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నెంబర్ 9 తీసుకువచ్చింది. కానీ కొందరు రాజకీయ, ప్రయోజనాల దృష్ట్యా దీన్ని అడ్డుకునే కుట్ర జరిగింది,” అని ఆయన విమర్శించారు.
దుండ్ర కుమార్ స్వామి మాట్లాడుతూ “హైకోర్టు మధ్యంతర స్టే ఇచ్చినప్పటికీ, ఇది తాత్కాలికం మాత్రమే. అవసరమైతే సుప్రీంకోర్టు వరకు పోరాటం కొనసాగిస్తాం. అంబేద్కర్ ఇచ్చిన ఓటుతోనే ఇలాంటి కుట్రలకు సమాధానం ఇస్తాం. న్యాయపోరాటం తో పాటు ప్రజా పోరాటం కూడా ప్రారంభిస్తాం. బీసీల ఐక్యతతోనే ఈ రిజర్వేషన్లను సాధించుకుంటాం,” అని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ పదవులకు 42 శాతం రిజర్వేషన్ల ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా అక్టోబర్ 9న నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది.
ఈ సమయంలో హైకోర్టు స్టే రావడం బీసీలలో తీవ్ర ఆవేదనను కలిగించింది అని అన్నారు. “సామాజిక న్యాయం సాధనలో ఇది తాత్కాలిక ఆటంకం మాత్రమే. ఐక్యంగా నిలబడి మన హక్కును తిరిగి సాధించుకోవాలి” అని దుండ్ర కుమార్ స్వామి పిలుపునిచ్చారు. జాతీయ స్థాయి నేతలు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం, తెలంగాణ రాష్ట్ర బీసీ జాగృతి అధ్యక్షుడు మురళీకృష్ణ, రాష్ట్రస్థాయి ముదిరాజ్ నాయకులు పాల్గొన్నారు.
