బీజేపీకి గుణపాఠం ఓటుతోనే చెబుదాం: దుండ్ర కుమారస్వామి
బడుగుల సాధికారత కోసం మహా ఉద్యమాన్ని మొదలుపెడతామని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు.(National President BC Dal Dundra Kumara Swamy)
కాచిగూడలో జరిగిన బీసీల అఖిలపక్ష సమావేశంలో జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మరియు బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – స్థానిక సంస్థల రిజర్వేషన్ల పెంపు కోసం, జనాభా గణనలో కుల గణన కోసం దశాబ్దాలుగా బీసీలు పోరాటాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించింది. కానీ కేంద్రం మాత్రం ముందుకు రావడం లేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అన్ని రకాలుగా సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించగా, కేంద్రం మాత్రం స్పందించకపోవడం బాధాకరం. ఇలాంటి సందర్భంలో ప్రత్యేక జీవోనే ఏకైక మార్గమని బీసీలు బలంగా నమ్ముతున్నారు. ప్రత్యేక జీవోతోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని గతంలోనే సూచించాం. ఇప్పుడు కూడా అదే మార్గం. ప్రత్యేక జీవో ద్వారానే రిజర్వేషన్ల పెంపుతో ఎన్నికలు జరగాలని గుర్తుంచుకోవాలి. గతంలో రాష్ట్రం రెండు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించింది. ఒకటి విద్యా, ఉద్యోగాల్లో బీసీల వాటా పెంపు, రెండోది స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌ను 42%కి పెంచడం. ఈ రెండు బిల్లులు గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి చేరగా, కేంద్ర హోం శాఖ వాటిని పెండింగులో ఉంచింది.
కేంద్రం చేస్తున్న ఆలస్యం బీసీలకు భారంగా మారనుంది. ఇది బీసీల పట్ల కేంద్రం నిర్లక్ష్యానికి సాక్ష్యం. బీజేపీ మొదటి నుంచే బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. బీసీ బిల్లును అడ్డుకోవడం అంటే బీసీల రాజ్యాంగ హక్కులను తాకట్టు పెట్టడమే. రాత్రికి రాత్రే ఈడబ్ల్యూఎస్‌కు 10% రిజర్వేషన్ ఇస్తారు. కానీ బీసీల 42% బిల్లును మాత్రం సంవత్సరాలుగా పెండింగులో పెడతారు. బీసీలు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో భారతీయ జనతా పార్టీ తప్పక చూస్తుంది.
తమిళనాడులో 69% రిజర్వేషన్లు 9వ షెడ్యూల్‌లో చేర్చారు. కానీ తెలంగాణ బిల్లును ఎందుకు ఆపుతున్నారు? ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, బీసీలను అణచివేయాలన్న బీజేపీ వ్యూహంగా ప్రతి బీసీ భావిస్తున్నాడు. కోర్టులు స్థానిక ఎన్నికల విషయంలో గడువు ఇచ్చాయి. ఆ గడువులో నిర్ణయం లేకుంటే పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరగాలి లేదా వాయిదా పడతాయి. అందుకే ప్రత్యేక జీవో ద్వారానే 42% రిజర్వేషన్లు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వేరే ఆప్షన్ లేదు. బీజేపీ నిజంగా బీసీలకు మద్దతుగా ఉంటే ప్రధాని మోదీని కలసి బీసీ బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చమని ఒత్తిడి చేయాలి. లేకుంటే చరిత్ర వారిని క్షమించదు.
పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285(ఎ) సవరణతో జీవో జారీ అయితే అన్ని స్థానాలకు కొత్త రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. ఈ అవకాశాన్ని బీసీలు సద్వినియోగం చేసుకోవాలి. గ్రామస్థాయిలో సత్తా చాటాలి. యువత ముందుకు రావాలి. బీజేపీకి ఒక సీటు కూడా రాకుండా గట్టి గుణపాఠం చెప్పాలి. అదే బీసీలు చెప్పే గట్టి సమాధానం.