ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
హైదరాబాద్, ఆగస్టు 20:
“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్‌లోని టీఎస్పీ (తెలంగాణ సరస్వతి పరిషత్) ఆడిటోరియంలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ, తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, అతిథులుగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, పర్యావరణ శాస్త్రవేత్త కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.
బండ ప్రకాష్ మాట్లాడుతూ…
“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో అనే నినాదాన్ని విస్తరించాలి. యువత భవిష్యత్తు నాయకులు. దేశ తలరాతలను మార్చగల శక్తి యువతలోనే ఉంది. సాహసం, శక్తి, సమాజ మార్పు – ఇవన్నీ యువతే సాధించగలరు” అని బండ ప్రకాష్ అన్నారు.
జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ—
“చంద్రయాన్–3 వంటి అంతరిక్ష ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలలో ఎక్కువ మంది 30 ఏళ్ల లోపు యువతరమే. భగత్‌సింగ్ చేసిన త్యాగం, ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదం యువతకు ఎప్పటికీ ప్రేరణ. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల త్యాగమే ప్రేరణగా నిలిచింది” అని ఆయన గుర్తుచేశారు.
“మీ లోపల ఉన్న శక్తిని వెలికితీయండి. గమ్యం చేరుకునే క్రమంలో ఎంతటి కష్టమైనా ఎదుర్కొని ముందుకు సాగండి. పరిగెత్తలేకపోతే నడవండి, నడవలేకపోతే పాకండి… కానీ గమ్యం మాత్రం తప్పక చేరుకోండి” అని యువతకు ప్రేరణనిచ్చారు.
అలాగే నేటి యువతను బలహీనపరుస్తున్న ప్రధాన సమస్యలు డ్రగ్స్, మద్యపానం అని పేర్కొన్నారు.
“అవి తాత్కాలిక ఆనందాన్ని ఇస్తాయి కానీ జీవితాన్ని నాశనం చేస్తాయి” అని హెచ్చరించారు.
“Youth is the power of the Nation అన్న స్వామి వివేకానంద మాట నేటికీ సజీవంగానే ఉంది. దేశానికి యువతే వెన్నుముక, యువతే గొప్ప సంపద, దేశ నిర్మాణంలో యువతే కీలక శక్తి” అని అన్నారు.
హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది సుమన్ మాట్లాడుతూ..
“యువత ఐక్యమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టించగలరు” పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


