ఫుడ్ పాయిజన్ ఘటనపై మానవహక్కుల కమిషన్ లో ఫిర్యాదు.
*నిర్లక్ష్యం వహించిన అధికారుల పై చర్యలు తీసుకోవాలి –జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు న్యాయవాది, దుండ్ర కుమారస్వామి
జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఉన్న మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల బాలికల హాస్టల్‌లో కలుషిత ఆహారం వల్ల విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన పై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చొరవ తీసుకుని బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, న్యాయవాది దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు.
ఈ మేరకు మానవ హక్కుల కమిషన్‌కు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసిన దుండ్ర కుమారస్వామి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘బుధవారం రాత్రి వడ్డించిన భోజనంతో 30 మందికి పై గా బాలికలు వాంతులు, కడుపునొప్పులతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంతమందిని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించాల్సి వచ్చింది. ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం.
ఈ తరహా ఘటనలు ప్రభుత్వ హాస్టళ్లలో వసతి తీసుకుంటున్న నిరుపేద విద్యార్థుల ఆరోగ్యహక్కు మరియు జీవితహక్కుల పై విఘాతం కలిగిస్తున్నాయని, ఇది క్షమించరానిది అన్నారు. ‘‘ఒకో దశలో ఒకదాన్ని మరిచేలా ఫుడ్ పాయిజన్ ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా నిత్యసంభవంగా మారాయి. అయినప్పటికీ సంబంధిత శాఖలు, అధికారులు ఏ మాత్రం చిత్తశుద్ధితో స్పందించకపోవడం బాధాకరం’’ అని విమర్శించారు.
ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం అన్ని గురుకుల విద్యాసంస్థల్లో ఆహార నాణ్యత నియంత్రణపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, సంబంధిత వారిని సస్పెండ్ చేయాలని కోరారు.