యూపీఏ హయాంనాటి లక్షా 76వేల కోట్ల రూపాయల విలువైన 2జీ కుంభకోణం కేసులో ఈ నెల 21న తీర్పు వెలువడనుంది. టెలికాం శాఖ మాజీ మంత్రి రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి సహా మరికొందరు నిందితుల భవితవ్యాన్ని తేల్చేలా ఈ నెల 21 ఉదయం 10.30గంటలకు దిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు ప్రకటించనుంది.
తీర్పు సమయంలో నిందితులంతా న్యాయస్థానంలో ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. 2007 మేలో టెలికం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎ.రాజా అదే ఏడాది ఆగస్టులో 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపు ప్రక్రియను ప్రారంభించారు. అయితే కొన్ని టెలికం సంస్థలకు అనుచిత లబ్ధి జరిగేలా స్పెక్ట్రమ్‌ను తక్కువ ధరకే కట్టబెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫలితంగా కేంద్ర ప్రభుత్వానికి లక్షా 76వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని కాగ్ అంచనా వేసింది. 2జీ కుంభకోణంపై దర్యాప్తు చేసిన సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రత్యేక కోర్టులో విడిగా అభియోగ పత్రాలు దాఖలు చేశాయి. వాటి ఆధారంగా విచారణ జరిపిన ప్రత్యేక న్యాయస్థానం ఈనెల 21న తీర్పు వెలువరించనున్నట్లు ప్రకటించింది.