బెంగళూరు: విదాన సౌధ వజ్రోత్సవాల్లో పాల్గొనడానికి భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మంగళవారం బెంగళూరు చేరుకున్నారు. భారత రాష్ట్రపతి అయిన తరువాత మొదటి సారి రామ్ నాథ్ గోవింద్ బెంగళూరు వచ్చారు. మంగళవారం సాయంత్రం రామ్ నాథ్ కోవింద్ కు ఘనంగా స్వాగతం పలికారు.
ప్రత్యేక విమానంలో రామ్ నాథ్ కోవింద్ బెంగళూరులోని హెచ్ ఏఎల్ విమానాశ్రయం చేరుకున్నారు. కర్ణాటక గవర్నర్ వాజుబాయ్ వాలా, ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేంద్ర మంత్రి అనంతకుమార్, కర్ణాటక హోం శాఖా మంత్రి రామలింగారెడ్డి తదితరులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఘనస్వాగతం పలికారు.
కర్ణాటక సాంప్రధాయం ప్రకారం మైసూరు పేట, శాలువాతో రామ్ నాథ్ కోవింద్ ను హెచ్ఏఎల్ విమానాశ్రయంలోనే సన్మానించారు. అనంతరం నేరుగా బీబీఎంపీ కేంద్ర కార్యాలయం చేరుకున్నారు. బీబీఎంపీ కేంద్ర కార్యాలయంలోని కెంపేగౌడ విగ్రహానికి రామ్ నాథ్ కోవింద్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో బీబీఎంపీ మేయర్ సంపత్ రాజ్, ఉప మేయర్ పద్మావతి నరసింహమూర్తి, పాలికె కమిషనర్ మంజునాథ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బుధవారం విదాన సౌధలో జరిగే వజ్రోత్సవాల కార్యక్రమంలో రాష్ట్రపతి రమ్ నాథ్ కోవింద్ పాల్గొంటున్నారు.