హుజూరాబాద్: తెలంగాణ రాష్ట్ర, హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమైందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఇల్లందకుంట మండల కేంద్రంలో జరిగిన హుజూరాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, స్థానిక నేతలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు
మాట్లాడుతూ..
టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కళ్లముందే కనిపిస్తుందని మంత్రి హరీశ్ అన్నారు. కాళేశ్వరం వచ్చాక ఎర్రటి ఎండల్లో కూడా నీరు పారిందన్నారు. కాళేశ్వరం తొలిఫలితం హుజూరాబాద్ ప్రజలకే దక్కిందన్నారు. రూ.10 కోట్లతో ఇల్లందకుంట రామాలయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. హుజూరాబాద్‌లో అభివృద్ధి కొనసాగాలె అన్న హరీష్, ఈటలకు మేలు జరగాలో, లేక నియోజకవర్గంలోని 2.29 లక్షల మందికి లాభం జరగాలో ఆలోచించాలని కోరారు. ఆత్మగౌరవం అనే పదం ఉచ్చరించే అర్హత రాజేందర్ కులేదు. పైసలు పంచుతున్నామని మాపై అబంఢాలు వేస్తున్నావు. గడియారాలు, గ్రైండర్లు, కుట్టు మిషన్లు, సెల్ ఫోన్లు పంచుతుంది నువ్వే కదా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఆత్మగౌరవం పేరుతో నీతులు చెప్పి ఇదా నువ్వు చేసే నిర్వాహకం. మేం కేసీఆర్ ఇచ్చే ఆసరా, రైతు బంధు, దళిత బంధుని నమ్ముకున్నాం. నీవు డబ్బులు, గడియారాలు, గ్రైండర్లు , కుట్టు మిషన్లను నమ్ముకున్నవు. ఎకరం అమ్మి ఎన్నికలు గెలుస్తా అని ఇంతకు ముందే రాజేందర్ అన్నాడు. రెండు గుంటల భూమి ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు , రెండు వందల ఎకరాల ఆసామి ఈటలకు మధ్య పోటీ. ఉద్యమ నేత, తెలంగాణ కోసం జైలుకు వెళ్లిన వ్యక్తి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కి మేమంతా అండగా ఉంటాం. కేసీఆర్ అండ, రాష్ట్ర క్యాబినెట్ అండ గెల్లుకు ఉందన్నారు.