తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి పురోగతి కనబడుతోంది. తాజాగా కేంద్ర హోం శాఖ కొంత సమాచారం కోరుతూ ఎన్నికల కమిషన్‌కు తాజాగా ఫైలు పంపింది. నియోజకవర్గాల పునర్విభజన చేపడితే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలుపై ఈసీ తన అభిప్రాయం చెప్పాలని అందులో కోరింది. ఈ రిజర్వేషన్లను 2001 జనగణన లేదా 2011 జనాభా లెక్కల్లో దేని ప్రాతిపదికన చేయాలన్న దానిపై కొంత వివాదం నెలకొంది. 2001 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని 2008లో నియోజకవర్గాలను పునర్‌వ్యవస్థీకరించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తమ రాష్ట్రాల్లో ఎస్సీ రిజర్వేషన్ సీట్లు పెంచాలని కోరుతూ మూడు రాష్ట్రాలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. ఆ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.
2008 పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 2026 వరకూ నియోజకవర్గాల్లో ఎటువంటి మార్పుచేర్పులకు అవకాశం లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. కానీ తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి పరిస్థితి మారింది. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని పార్లమెంటు ఆ తర్వాత ఆమోదించింది. ఈ రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణకు 2008 నాటి చట్టంలోని నిబంధనలే వర్తిస్తాయా లేక 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలా అన్నది కేంద్ర హోంశాఖ ముందున్న సమస్య. దీనిపైనే హోంశాఖ ఈసీ అభిప్రాయం కోరింది. మరో అంశం కూడా తేలాల్సి ఉంది. పోయినసారి నియోజకవర్గాలను పునర్విభజించినప్పుడు ఎస్సీ నియోజకవర్గాలను రాష్ట్రమంతా విస్తరింపజేశారు. వారి జనాభా ఎక్కువ ఉన్నచోట మాత్రమే ఇస్తే రిజర్వుడు నియోజకవర్గాలన్నీ ఒకేచోట వస్తున్నాయని.. అది సరికాదనే అభిప్రాయంతో ఇలా చేశారు.
అప్పటి చట్టం దాని కి అనుమతించింది. ఇప్పుడు కూడా దానినే పరిగణనలోకి తీసుకోవాలా అన్నది మీమాంస. దీనిపైన ఈసీ తన అభిప్రాయాన్ని తెలపాల్సి ఉంది. ఈ అభిప్రాయాల వెల్లడికి ఎన్నికల కమిషన్ ఎక్కువ సమయం తీసుకోదని, ఒకట్రెండు రోజుల్లోనే తెలియజేస్తుందని హోంశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ తర్వాత మరో 4 శాఖలకు కూడా హోం శాఖ ఇటువంటి లేఖలు రాయాల్సి ఉంది. వాటికి కూడా సమాధానాలు వచ్చాక అన్నిటినీ కలిపి తుది ప్రతిపాదనలు సిద్ధం చేస్తారు. వాటిని పీఎంవో ఆమోదించాక దీనిని మంత్రివర్గ సమావేశం ముందు పెడతారు. కేబినెట్ ఆమోదంతో అది పార్లమెంటు ముందుకు వెళ్తుంది. అంతిమంగా రాజకీయ నిర్ణయమే కీలకమని హోం శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాజకీయ నిర్ణయం తరువాత రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాలు పెరుగుతాయని ఒక సీనియర్ అధికారి స్పష్టం చేశారు.