ఆసియాలోనే అతి పెద్ద ఆదివాసిల ఉత్సవం మేడారం జాతర. సమ్మక్క సారలమ్మ నామస్మరణతో మేడారం మారుమోగిపోయింది. ఇసుక వేస్తే రాలనంత జనం తో జాతర జనసంద్రాన్ని తలపించింది. ఇప్పటివరకు ఒక కోటి పది లక్షల మంది దర్శించుకున్నారు అని ఆ సంఖ్య ఇంకా పెరుగుతుందని అధికారులు చెప్పారు. నిన్న ఒక్కరోజే 30 లక్షల మందికి పైగా మేడారం జాతర మొక్కును చెల్లించుకున్నారు.
శుక్రవారం ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు మేడారం వచ్చారు. సమ్మక్క–సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు లను గద్దెలపై ఉంచారు. సాధారణ ప్రజలనుంచి వీఐపీల వరకు ఈ దేవతలను దర్శించుకోవడానికి క్యూ కట్టారు. చీరలు, రవిక బట్టలు, బంగారం (బెల్లం), ఎదురుకోళ్లు, ఒడి బియ్యం, కొబ్బరికాయలు ల తో మొక్కులు తీర్చుకున్నారు.
మంత్రులు కిషన్ రెడ్డి, రేణుకా సింగ్ హెలికాప్టర్లలో మేడారం చేరుకున్నారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, దయాకర్ రెడ్డి వారిని ఆహ్వానించి వనదేవతల దర్శనం చేయించారు. బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తదితరులు దర్శించుకున్నారు.
ఈ రోజు వనదేవతలు సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెల నుండి వనంలోకి ప్రవేశిస్తారు. అందుకని గద్దెల పైన ఈరోజు దర్శించుకునే వారికి చివరి అవకాశం కావున ఈ రోజు జనాలు ఇంకా ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.