GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు
తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమైన నిర్వాకం కారణంగానే హైకోర్టు స్టే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తీవ్రంగా విమర్శించారు. గురువారం రోజు ఆయన రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ: రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని చేతిలో పెట్టుకుని ఉద్దేశపూర్వక తప్పిదాలతో బీసీలకు అన్యాయం జరిగేలా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు సమగ్రంగా వినిపించలేకపోయిందని, న్యాయమూర్తుల ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేకపోయారని ఆయన అభిప్రాయపడ్డారు.
మెదటి నుంచే పరిపాలనలో జరుగుతున్న అన్ని తప్పులను ఎత్తి చూపినా, రేవంత్ ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా బీసీల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టిందని ఆయన ఆరోపించారు. 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం సుప్రీంకోర్టులో సమర్థవంతంగా వాదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా లేదా అన్న ప్రశ్నను ఆయన ముందుకు తెచ్చారు. బీసీల హక్కులను రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఇకనైనా హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ వాదనలకు సమగ్రంగా సిద్ధం కావాలి. ఇచ్చిన వాగ్దానం నిలబెట్టడానికి ప్రభుత్వం నిజాయితీ కృషి చేయాలి” అని వకుళాభరణం డిమాండ్ చేశారు.