సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నివాళులు
సమానత్వం కోసం పోరాడిన మహనీయ వనిత – దుండ్ర కుమారస్వామి
అసమానతలతో నిండిన సమాజంలో సమానత్వం కోసం పోరాటం చేసిన మహనీయ వనితగా సావిత్రిబాయి పూలే చరిత్రలో నిలిచిపోయారని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి అన్నారు.
భారతదేశంలోని తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని శనివారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో బీసీ రాష్ట్ర కమిటీ సభ్యులు రాజేష్ యాదవ్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె జీవితం, సేవలు, ఆశయాలను స్మరించుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన సందర్భమిదని అన్నారు. స్త్రీలు చదువుకోవడం అసాధ్యమని భావించిన రోజుల్లో ఆ అసాధ్యాన్ని సుసాధ్యంగా మార్చిన ధైర్యశాలీ మహిళ సావిత్రిబాయి పూలే అని పేర్కొన్నారు. భారతదేశంలో మహిళల విద్య కోసం మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించి, విద్య విలువను సమాజానికి తెలియజేసి, మహిళల జీవితాల్లో విప్లవాత్మక మార్పును తీసుకువచ్చారని తెలిపారు.
అణగారిన వర్గాలు, అంటరాని వారు, మహిళలు—అందరికీ విద్య అందాలనే ఏకైక దృఢ సంకల్పంతో విద్యాసంస్థలను స్థాపించారని గుర్తు చేశారు. సమాజంలో ఎన్ని కష్టాలు, ఒడిదుడుకులు ఎదురైనా, అవమానాలు, విమర్శలు, దాడులను తట్టుకుంటూ తాను నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకు సాగిన గొప్ప సామాజిక యోధురాలని కొనియాడారు.
జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజంలో చురుకుగా పనిచేస్తూ కులవ్యవస్థకు వ్యతిరేకంగా, అణగారిన వర్గాల హక్కుల కోసం, బాల్యవివాహాలు, మూఢనమ్మకాలు, సతి సహగమనం, అంటరానితనం వంటి దురాచారాలకు వ్యతిరేకంగా తీవ్రంగా పోరాటం చేశారని వివరించారు.
మహిళల సాధికారత కోసం మహిళా సేవా మండల్‌ను స్థాపించి క్రియాశీలకంగా పనిచేసిన గొప్ప విప్లవకారిణి సావిత్రిబాయి పూలేనని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం, రైతులు, కార్మికులు, మహిళల హక్కుల కోసం నిరంతరం పోరాడిన ప్రజానాయకురాలని అన్నారు. తాను నమ్ముకున్న సిద్ధాంతం, లక్ష్యం కోసం చివరి శ్వాస వరకు శ్రమించిన సామాజిక పోరాట యోధురాలు సావిత్రిబాయి పూలే అని, కోట్లాది మందికి ప్రేరణనిచ్చిన ఆమె జీవితం ఒక గొప్ప చరిత్రగా నిలిచిందని చెప్పారు. భవిష్యత్ తరాలకు నిరంతరం స్ఫూర్తినిచ్చే మార్గదర్శకురాలు సావిత్రిబాయి పూలే అని దుండ్ర కుమారస్వామి పేర్కొన్నారు.