సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా రాబోతున్నారు.
ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి కీలక డిమాండ్లు చేశారు. ఖర్గే గారు ఈ సభ వేదికపై బీసీ రిజర్వేషన్ల పెంపు పై స్పష్టమైన ప్రకటన చేయాలని, కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయడానికి జాతీయ స్థాయిలో కార్యచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాల్సిన బాధ్యత పార్టీపై ఉందని గుర్తు చేశారు.
“ఖర్గే గారు బీసీలకు అండగా ఉంటామన్నారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ హామీ అమలు చేస్తే బీసీ సమాజం కాంగ్రెస్‌ను గుండెల్లో పెట్టుకుంటుంది” అని దుండ్ర కుమారస్వామి స్పష్టం చేశారు.
