ఫిల్మ్ నగర్: కరోనా మహమ్మారి ధాటికి థియేటర్లు మూతపడటంతో చాలా సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధె’ సినిమాను సైతం ఒకేసారి ఓటీటీలో మరియు కొన్ని అందుబాటులో ఉన్న థియేటర్లలో విడుదల చేశారు. ఒకప్పుడు చిన్న సినిమాలు మాత్రమే నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఓటీటీ సంస్థలు కూడా క్రేజీ ప్రాజెక్ట్ లను సొంతం చేసుకోవాలని చూస్తున్నాయి. ఈ క్రమంలో మీడియం, స్టార్ హీరోల సినిమాలపై దృష్టి పెడుతున్నాయి.

నాని నటించిన ‘టక్ జగదీష్, రవితేజ ‘ఖిలాడి’, విశ్వక్ సేన్ ‘పాగల్’, సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసే విధంగా మంచి రేట్ ఆఫర్ చేశాయి. కానీ ఈ సినిమాల దర్శకనిర్మాతలు తమ సినిమాలను నేరుగా థియేటర్లలోనే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. హీరోలెవరూ కూడా తమ సినిమాలను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఒప్పుకోవడం లేదు. తమ సినిమాలు ముందుగా థియేటర్లోనే విడుదల కావాలంటూ పట్టుబట్టి కూర్చున్నారు. దీంతో నిర్మాతలకు ఓటీటీ సంస్థల నుండి ఒత్తిడి పెరుగుతోందని సమాచారం.

అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి పేరున్న ఓటీటీ లాంటి సంస్థలు ఆఫర్ చేస్తున్న డీల్ చాలా టెంప్టింగ్ గా ఉన్నప్పటికీ నిర్మాతలు మాత్రం నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. హీరోలు థియేటర్లలో రిలీజ్ చెయ్యాలని పట్టుబట్టి కూసోవడంతో, వారిని ఎదిరించి ఓటీటీలతో ఒప్పందం కుదుర్చుకునే ధైర్యం లేక నిర్మాతలు సైలెంట్ గా ఊరుకుంటున్నారని సమాచారం. కానీ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు తెరుచుకున్నా కూడా యాభై శాతం ఆక్యుపెన్సీతో నడిపిస్తారు. జనాలు ఎంతవరకు థియేటర్లకు వస్తారో చెప్పలేని పరిస్థితి. ఇన్ని సందేహాల నడుమ ఓటీటీకి సినిమాను అమ్మితేనే కనీసం లాభాలైనా వస్తాయని నిర్మాతలు భావిస్తున్నారట. రానున్నారోజుల్లో ఏం జరుగుతుందో వేచిచూడాలి..

Leave a Reply

Your email address will not be published.